29-09-2025 03:57:27 PM
విజయదశమి ఉత్సవంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ ప్రచారక్ కడమంచి విగ్నేశ్వర్ పిలుపు
హనుమకొండ,(విజయక్రాంతి): వ్యక్తులను నిర్మాణం చేసే ఆర్ఎస్ఎస్ శాఖలను నగరంలోని ప్రతి బస్తీలో ప్రారంభించాలని స్వయంసేవకులకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వరంగల్ విభాగ్ ప్రచారక్ కడమంచి విగ్నేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ వడ్డేపల్లి బస్తీ స్వయం సేవకులు కనకదుర్గ కాలనీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన విజయదశమి ఉత్సవానికి ఆయన ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా కిట్స్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రచారక్ కడమంచి విగ్నేశ్వర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ విజయదశమితో వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో దేశ హితం కోరే ప్రతి స్వయంసేవకుడు తాము నివసిస్తున్న బస్తీలలో సంఘ శాఖలను ప్రారంభించి దేశభక్తులను తీర్చిదిద్దాలని కోరారు. ఆర్ఎస్ఎస్ శాఖ కార్య పద్ధతి కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా వేళ్ళునుకుందన్నారు.వంద సంవత్సరాల క్రితం సంఘం ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో ప్రారంభించబడిందో అదే లక్ష్యసాధనకు దేశవ్యాప్తంగా లక్ష శాఖలతో పనిచేస్తుందన్నారు. శాఖలో తయారైన స్వయం సేవకుల కారణంగా సమాజ పరివర్తన జరుగుతుందన్నారు.
సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ వస్తువుల వినియోగము, కుటుంబ ప్రబోధనము, పౌర విధులను పాటించడం లాంటి ఐదు విషయాలలో ప్రతి భారతీయుడిని స్వయం సేవకులు జాగరుకులను చేయాలని కోరారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి స్వయంసేవక్ రోజుకు రెండు గంటల సమయం ఇచ్చి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. కులం, భాష, ప్రాంతం, వర్గం, వర్ణం పేరుతో మనల్ని చీల్చుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొన్ని లక్షల మంది స్వయం సేవకుల బలిదానం ఫలితంగా ఈరోజు సంఘం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నారు. మన సంస్కృతిని దెబ్బతీసే కార్యక్రమాలను అడ్డుకోవాలని ఆయన స్వయం సేవకులను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిట్స్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర వహించిందన్నారు.