calender_icon.png 29 September, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

29-09-2025 03:50:17 PM

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం..

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఎన్నో ఏండ్ల పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేస్తున్నారనీ, కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఈ బతుకమ్మ దసరా పండుగకు ఒక ప్రత్యేకత ఉందనీ, ఇందిరమ్మ ఇండ్లను ముఖ్యమంత్రి దసరా కానుకగా అందిస్తున్నారని తెలిపారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 194 లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను  అందజేశారు. అంతకుముందు చర్లబుత్కూరు గ్రామంలో రాజేందర్రావుకు గ్రామ ప్రజలు, మహిళలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన అనంతరం వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడుతూ దసరా కానుకగా కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని కోరానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేయాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారని లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ అందించాలని సూచించారని రాజేందర్రావు తెలిపారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారులను పురమాయించి కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు యుద్ధ ప్రాతిపదికన అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు.కరీంనగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని రాజేందర్ తెలిపారు. దీంతో అదనంగా మరో నాలుగు వేల ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాననీ, ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కొద్ది రోజుల్లో మరో నాలుగు వేల ఇండ్లను ముఖ్యమంత్రి మంజూరు చేస్తారని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన బడుగు బలహీన వర్గాలు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాజేందర్రావు హామీ ఇచ్చారు. దసరా తర్వాత ఇండ్ల నిర్మాణం పనులు లబ్ధిదారులు చేపట్టాలనీ, వచ్చే దసరా లోపు పనులన్నీ పూర్తి చేయించి గృహ ప్రవేశాలు దగ్గరుండి చేయిస్తానని రాజేందర్ రావు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా గతంలో జరుపుకున్న బతుకమ్మ దసరా పండుగ కంటే ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బతుకమ్మ దసరా వేదికలను అత్యంత ఆనందోత్సాహాల మధ్య ప్రజలు జరుపుకోవాలని రాజేంద్ర రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనీ, పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు ముందుకు సాగుతున్నదని తెలిపారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని ప్రజలకు ద్రోహం చేశారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని రాజేందర్రావు మండిపడ్డారు. కరీంనగర్ నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదనీ, అసలు పేదలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావును ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.