7 April, 2026 | 10:26 AM

సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి జూపల్లి

01-12-2024 04:00 PM

కేసీఆర్ చుక్కనీరు ఇవ్వలేదు

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపన రేవంత్ రెడ్డికి ఉందని ఆయన వెల్లడించారు. వలసల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని జూపల్లి పేర్కొన్నారు. పాలమూరు సాగునీటి కష్టాలను బీఆర్ఎస్ తీర్చలేకపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసమంటూ రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్ చుక్కనీరు ఇవ్వలేదని జూపల్లి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రూ. 500 బోనస్ తో రైతులు, కౌలురైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ది గొప్పపాలన అయితే రాష్ట్రం అప్పుల పాలు ఎందుకైందని జూపల్లి ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు.