08-02-2025 05:54:24 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అవినీతికి వ్యతీరేకంగా పోరాడుతామని రాజకీయాల్లోకి వచ్చిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చివరికి అవినీతికి చిరునామాగా మారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఢిల్లీలో ఇకపై అభివృద్ధి జరుగుతుందన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్, సిసోదియాను ప్రజలు ఓడించారని, కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ న్యాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఎన్నో ఓటమో కూడా లెక్కపట్టలేమని వ్యంగ్యంగా మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడవ సారి డకౌట్ అయ్యిందని, అసులు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్ కు ఎప్పుడూ ఉండదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీ పార్టీని ఓడించాలని మాత్రమే రాహుల్ గాంధీ ఆలోచిస్తారని మండిపడ్డారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరగటం కాదు.. రాజ్యాంగ విలువలు పాటించాలన్నారు. కేజ్రీవాల్ నాయక్వతంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. లిక్కర్ స్కామ్ పై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇక కోర్టు తీర్పు రావాల్సి ఉందని చురకలంటించారు. జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఎన్ని ఉచిత పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వని ప్రజలు నమ్మకుండా తిప్పికొట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు