calender_icon.png 13 January, 2026 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

​ప్రజల జీవితాల్లో మార్పే నిజమైన అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

13-01-2026 11:15:50 AM

చేవెళ్ల నియోజకవర్గంలో రూ. 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు కాంగ్రెస్‌వే.. బీఆర్ఎస్‌కు అభ్యర్థులే లేరు

100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమిపూజ

​చేవెళ్ల,(విజయక్రాంతి): "ప్రజల జీవితాల్లో కనిపించే మార్పే నిజమైన అభివృద్ధి అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని" రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి మున్సిపాలిటీలలో మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ​మొయినాబాద్ లో మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద అభివృద్ధి పనులు, రూ. 30 కోట్లతో చందానగర్ నుండి కవేలిగూడ వరకు రోడ్డు వెడల్పు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే చేవెళ్ల పట్టణంలో రూ. 17.5 కోట్లతో నిర్మించనున్న 100 పడకల నూతన ఆసుపత్రి భవనానికి భూమిపూజ చేశారు. శంకర్ పల్లిలో రూ. 15 కోట్ల పనులతో పాటు కొత్త జేసీబీని ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో రూ. 2.42 కోట్లతో భక్తుల వసతి గదులు, ఇతర సౌకర్యాలకు శ్రీకారం చుట్టారు.

బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారు.....

​అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో  మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో విజయం సాధించబోతోందని.... దీనిపై ఎవరితోనైనా సవాల్‌కు సిద్ధం. బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు, వారి అంతర్గత కొట్లాటలతోనే ఆ పార్టీ ఖాళీ అవుతోంది" అని ఎద్దేవా చేశారు.

​పేదల సొంతింటి కల నెరవేరుస్తాం

​గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ​అనంతరం చేవెళ్లలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను మంత్రులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.