calender_icon.png 13 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్థలంలో.. మున్సిపల్ అక్రమ నిర్మాణాలు..!

13-01-2026 11:08:45 AM

కేసు కోర్టులో ఉండగానే కొనసాగుతున్న నిర్మాణాలు 

న్యాయం చేయాలని బాధితుల ఆవేదన 

పిటిషన్ దారుకు వ్యతిరేకంగా కింది కోర్టులో తీర్పు 

ప్రజల కోసమే సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం:  మున్సిపల్ కమిషనర్ మురళి

అచ్చంపేట: తమ పట్టా భూమికి సంబంధించిన కేసు హైకోర్టు పరిధిలో ఉండగానే పురపాలిక అధికారులు తమ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని పాత బస్టాండ్ సమీపంలోనీ నెహ్రు చౌరస్తా నుంచి వలపట్లకు వెళ్లే మార్గంలోని.. అంతర్గత ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సర్వేనెంబర్ 384లో నేనుగా యాదయ్యకు 150 గజాల ఓపెన్ ప్లాట్ ఉంది. ఆయన దాన్నీ 2013లో మందుల ఎర్రమ్మ వద్ద కొనుగోలు చేశారు.

ప్రస్తుతం అచ్చంపేట మున్సిపల్ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ భూమిగా  భావించి సులభ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. దీంతో ఎంతో విలువైన తమ స్థలాన్ని ఆక్రమించుకోవడం వలన ఆర్థిక నష్టంతోపాటు.. మానసిక వేదనకు గురవుతున్నామని బాధితుడు యాదయ్య కన్నీటి పర్యంతమయ్యారు. సదరు స్థలం గురించి జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా .. 2025 సెప్టెంబర్ 16న  కొట్టి వేసిందని చెప్పారు. దీంతో కేసును సవాల్ చేస్తూ తీర్పును 2025 నవంబర్ 14న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగానే మున్సిపల్ అధికారులు అక్రమంగా తమ స్థలంలో నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదన్నారు.

కేసుకు సంబంధించి హైకోర్టులో కౌంటర్ వేయకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.  హైకోర్టులో కేసుకు సంబంధించిన పూర్తి వాదన మించిన తర్వాత తీర్పు.. పురపాలికకు అనుకూలంగా వస్తే కోర్టు తీర్పును గౌరవిస్తామని. కానీ కోర్టు పరిధిలో ఉండగానే మున్సిపల్ అధికారులు నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ మున్సిపల్  అధికారుల వద్ద పై స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఎందుకు హైకోర్టుకు సమర్పించడం లేదని  ప్రశ్నించారు.

 ప్రజా అవసరాల కోసమే నిర్మాణాలు: మున్సిపల్ కమిషనర్

సివిల్ కోర్టులో కేసు కొట్టేయడంతో కొట్టేయడంతో.. రెండెల్లా క్రితమే మున్సిపల్ ఆ స్థలంలో సులభ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేసిందని మున్సిపల్ కమిషనర్ మురళి తెలిపారు. సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో  ఉన్నతాధికారుల ఆదేశా మేరకు ఈ ఏడాది మార్చి 31లోగ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. బాధితుడు హైకోర్టులో ఆపిల్ చేసుకున్న విషయంలో కోర్టు  పనులు ఆపమని ఎక్కడ సూచించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. తమ శాఖకు సంబంధించిన లీగల్ అధికారులు కోర్టు కేసులను పరిశీలిస్తారని, దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత లీగల్ అధికారులకు అందజేశామన్నారు. వ్యక్తిగతంగా ఎవరని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం పురపాలికకు లేదన్నారు.