30-12-2025 03:03:29 PM
తూప్రాన్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో పర్యటన
సంక్రాంతి రద్దీపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్: సంక్రాంతి సమయంలో రహదారిపై రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8 నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిపారు. సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారని చెప్పారు. గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతోందన్నారు.
వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బుధవారం నాడు తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్(Abdullahpurmet) ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ(From LB Nagar to Ramoji Film City) వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. జాతీయరహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండగ రద్దీ ఉన్న రోజుల్లో భారీ యంత్రాలతో జరిగే పనులు నిలిపివేయాలన్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని, అన్ని రహదారుల లేన్లు వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు పెట్టాలని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో సమన్వయం పాటించాలని వాహనాదారులకు సూచించారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా అదనపు బృందాలు మోహరించాలని మంత్రి తెలిపారు.
''సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ(Highway traffic) నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. హైదరాబాద్–విజయవాడ హైవేపై(Hyderabad-Vijayawada highway) జనవరి 8 నుంచి వాహన రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. రద్దీ రోజుల్లో లేన్‌లు మూసే పనులు నిలిపివేయాలి, అన్ని లేన్‌లు వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలి, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసుల మోహరింపు, స్పష్టమైన బోర్డులు, హై విజిబిలిటీ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించాను. ప్రజలు సురక్షితంగా, సజావుగా తమ పండుగ ప్రయాణాలు పూర్తిచేసేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తుంది.'' అని కోమటిరెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.