calender_icon.png 17 February, 2026 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

17-02-2026 07:54:10 PM

చిట్యాల,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదానికి గురైన  క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా తక్షణ చర్యలు తీసుకొని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం జాతీయ రహదారి 65పై చిట్యాల మండల సమీపంలోని గుండ్రాంపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహన ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే  నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరోని బండకు చెందిన రమేష్ టిఫిన్ చేసి రోడ్డు దాటుతుండగా, అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ అనే వ్యక్తి బైక్ పై హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు.

రోడ్డు దాటుతున్న రమేష్ ను బైక్ తో వెంకట్ ఢీకొట్టగా దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించారు. నల్లగొండ నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి తన కాన్వాయ్‌ను తక్షణమే ఆపించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్యులతో స్వయంగా మాట్లాడి బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.