పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'
ఈ నెల 25 నుంచి నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి
ఒకే వేదికపైకి అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలోనే సమస్యలకు చెక్ పెట్టేలా వ్యూహం
కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి
ఖమ్మం,(విజయక్రాంతి): "ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన" అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని నిజం చేస్తూ పాలేరు(Palair) నియోజకవర్గంలో సరికొత్త ప్రజా పాలన శకానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) శ్రీకారం చుట్టారు. సామాన్యులు తమ చిన్న చిన్న సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పని లేకుండా, అధికారులందరినీ ప్రజల ముంగిట నిలబెట్టేలా క్షేత్రస్థాయిలో 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని రూపొందించారు.
అధికారులంతా ఒకే చోట..
ఈ ప్రజా దర్బార్‌లో జిల్లా కలెక్టర్ మొదలుకొని నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల విజ్ఞప్తులు, కొత్త రేషన్ కార్డులు, స్థానిక మౌలిక సదుపాయాల వరకు.. ఏ రకమైన సమస్యకైనా తక్షణ పరిష్కారమే ధ్యేయంగా మంత్రి ఈ వేదికను తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం.
క్లస్టర్లుగా ఏర్పాటు
ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నాలుగు మండలాల్లో క్లస్టర్లు గా విభజించారు. మండలానికి ఆరు నుంచి ఏడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అందులో ఒక్కొక్క క్లస్టర్ కు 6నుంచి 10 పంచాయతీలను కలిపి ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేసి, ప్రజలు, జిల్లా, మండల, గ్రామీణ స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రాయిగూడెం, సుబ్లేడుల్లో తొలి అడుగు
ఈ నెల 25వ తేదీ శనివారం రెండు ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నేలకొండపల్లి మండలం రాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తొలి దర్బార్ జరుగుతుంది. ఈ కేంద్రానికి రాయిగూడెం, అజయ్‌తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలతో హాజరుకావచ్చు. మధ్యాహ్నం 3:30 నుండి తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 3:30 గంటల నుండి రాత్రి 7:30 వరకు రెండో వేదిక సిద్ధమైంది.
ఈ కేంద్రానికి సుబ్లేడు, లక్ష్మీదేవిపల్లి తండా, రఘునాధపాలెం, హస్నాబాద్, ఇస్లావత్ తండా, మహమ్మదాపురం, మేకల తండా, మేడిదపల్లి, చంద్రు తండా, జోగులపాడు, పాతర్లపాడు, గోల్ తండా, జల్లెపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తరలిరానున్నారు. "తన నియోజకవర్గంలో ఏ ఒక్క పౌరుడు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకూడదనే ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను" అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ పూర్తి సమాచారంతో క్షేత్రస్థాయికి రావాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.






