calender_icon.png 25 January, 2026 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి

25-01-2026 04:56:58 PM

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... అన్ని వార్డుల నుంచి తరలివచ్చిన పార్టీ ఇంచార్జీలు, ముఖ్య నాయకులకు, ఆశావాహులకు మున్సిపాలిటీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. శివరాత్రి లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉందని, సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 

ఏదులాపురం, ఇల్లెందుల  అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించామని, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పార్టీ బలపరచిన అభ్యర్ధులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయమని, వారసత్వ రాజకీయాలకు చోటు లేదని, నా రక్త సంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వనని, ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నామని తెలిపారు. 

టికెట్ల కేటాయింపులో ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని మంత్రి వెల్లడించారు. టికెట్ రాని వారు  నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దని, అటువంటి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని సూచించారు.

పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి  గుర్తింపు ఉంటుందని, అధికారంలో ఉన్నాం కాబట్టి  భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కావున పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్యకర్తలే నా బలం, వారి  కష్టమే నాకు గౌరవం. నేను ఎప్పుడూ వారిని విస్మరించను. నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటూ నా కుటుంబసభ్యులుగా కాపాడుకుంటాను.