22A బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి
- కోర్ హైదరాబాద్ కు 22A అంశం జఠిలం.
- 22A బాధితులకు న్యాయం చేస్తాం.
- ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..
- ప్రతిపక్షం అబద్ధాలతో భయాందోళనలో ప్రజలు.
- ఆర్డర్స్ అన్నింటినీ ఆన్లైన్ లో అప్లోడ్ చేశాం..
- స్లాట్ బుక్ చేస్తున్న 98 శాతం మంది రిజిస్ట్రేషన్లు క్లియర్ చేస్తున్నాం.
హైదరాబాద్: ప్రతి సోమవారం జిల్లా అధికారులతో తరుచూ రివ్యూ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 22ఏ జాబితాలోనివి, వివిధ ఆర్డర్లలో ఉన్న వివరాల అప్ లోడ్ చేస్తామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) 22ఏ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 22ఏ పరిధిలో రిలాక్సేషన్ వచ్చిన వాటిని క్లియర్ చేశామని వివరించారు. మేడ్చల్ లోని భూదాన్ భూముల్లోని వాటిని తిరస్కరించామని తెలిపారు. స్లాట్లు బుక్ చేసి రిజిస్ట్రేషన్ కాకపోతే వారంలో ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి టోల్ ఫ్రీ నంబర్ కు 1162 కాల్స్ వచ్చాయన్నారు. టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చిన కాల్స్ ను జిల్లాలవారీగా పంపించామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులవి కాకుండా ప్రభుత్వ ఆస్తుల సమస్యలే ఎక్కువన్నారు. 22ఏ సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగినవాటిలో 24 గంటల్లో క్లియర్ చేశామని సూచించారు. ఎక్కడైనా ఒకట్రెండు ఆగిపోతే ఆందోళన చెందనక్కర్లేదన్నారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్లు చేయాలని లేఖలు రాస్తున్నారు. నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సీఎస్ 7,14కు సంబంధించి వివాదాలు చేశారని చెప్పారు. భూములకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం నెలకొందని మంత్రి స్పష్టం చేశారు.






