24 August, 2026 | 3:57 PM

చిట్యాలలో విద్యుత్ సమస్య పరిష్కరించాలి

24-08-2026 03:24 PM

చిట్యాల, ఆగస్టు 24(విజయ క్రాంతి ): చిట్యాల మున్సిపాలిటీలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నందున సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపి నాయకులు మాట్లాడుతూ.. ఊరుమడ్ల రోడ్డులోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ రోజుకు 15 నుంచి 20 సార్లు నిలిచిపోతోందని తెలిపారు. దీంతో వ్యాపారులు, ఆస్పత్రులు, గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రైల్వే లైన్ కారణంగా కొత్త ఫీడర్ ఏర్పాటు చేయలేకపోతున్నందున రైల్వే ట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో కొత్త సబ్‌స్టేషన్ లేదా ఫీడర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అది సాధ్యం కాకపోతే ప్రస్తుతం ఉన్న రెండు పీటీఆర్‌లలో ఒకదానిని బస్టాండ్ ప్రాంతానికి తరలించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ  కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుంచు శ్రీనివాస్, మాస శ్రీనివాస్, జయరాపు రామకృష్ణ, గంజి గోవర్ధన్, చికిలం మెట్ల అశోక్, కన్నబోయిన మహాలింగం, గోషిక వెంకటేశం, కాంచర్ల శంకర్‌రెడ్డి, ఈడుదల మల్లేష్, కన్నెబోయిన మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.