25-05-2025 10:58:09 PM
మూగజీవాలు కోల్పోయిన రైతులకు అండగా మంత్రి పొంగులేటి..
ఖమ్మం (విజయక్రాంతి): నేనున్నానని... అధైర్య పడకండని.. 75 మూగజీవాలు కోల్పోయిన రైతులతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండా గ్రామంలో కొందరి రైతులకు చెందిన సుమారు 75 మేకలు మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లిన మేకలు మృత్యువాత పడడంతో రైతుల ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో స్థానిక గిరిజన రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలీ తదితరులు రైతులను ఓదార్చి మూగజీవాల ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామ హాయం రఘురాం రెడ్డి తక్షణమే రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని ఫోన్ ద్వారా రైతులకు హామీ ఇచ్చారు.