03-10-2025 04:10:00 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజాప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడిచిపెట్టడానికి సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) కు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ విచ్చేసిన సందర్బంగా బేగంపేట విమానాశ్రయంలోమేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి పొన్నం రాజ్ నాథ్ సింగ్ కు అందజేశారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని పొన్నం పేర్కొన్నారు. కంటోన్మెంట్ నుండి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వలన రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందన్నారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అయితే ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు , మొబిలిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ భూమార్పిడి కీలకం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగడం లేదని మీ దృష్టికి తీసుకువస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన, స్థానిక ప్రాతినిధ్యం దృష్ట్యా, ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.