25 April, 2026 | 2:13 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి

25-04-2026 12:32 AM

వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్‌లో ఆర్టీసీ కార్మికుల భారీ నిరసన ర్యాలీ 

గజ్వేల్, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతికి కారణమైన రాష్ట్ర  ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో పాల్గొని బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు   మద్దతు పలికారు.

గజ్వేల్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ కార్మికులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం, కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. నర్సంపేట బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, 80 శాతం పైగా గాయాలతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు.

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మండల అధ్యక్షుడు బెండ మధు, తదితరులు, బీఆర్‌ఎస్ నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.