24 July, 2026 | 1:36 PM

టెర్మినల్-1 ఘటనను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

28-06-2024 11:25 AM

న్యూఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆయన టెర్మినల్-1 పైకప్పు ఊడిపడిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు శుక్రవారం తెల్లవారు జామున 5.00 గంటల సమయంలో  ఊడిపడిందన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెంగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.  గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని,ఘటనాస్థలిలో సీఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టెర్మినల్-2, టెర్మినల్-3 నుంచి విమానాల రాకపోకలు కొనసాగేలా చేస్తున్నామని, ప్రయాణికులకు టిక్కెట్ ఛార్జీలను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ప్రయాణికుల భద్రతే మాకు ప్రధానమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రారంభంచిన భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, 2009లో నిర్మించిన భవనం పైకప్పు మాత్రమే కూలిందన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందాక తదుపరి చర్చలు తీసుకుంటామన్నారు.