28-01-2026 03:32:54 PM
పుణె: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) విమాన ప్రమాదంలో మరణించిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు(Civil Aviation Minister Ram Mohan Naidu) స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ... విమానం ల్యాడింగ్ వేళ సరైన వెలుతురు లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విమానం దిగడానికి ముందు ఏటీసీ పైలట్‌ను రన్‌వే కనిపిస్తోందా అని అడిగిందని, దానికి అతను కనిపించడం లేదని ధృవీకరించినట్లుగా తెలిపారు.
ఒక గో-అరౌండ్ తర్వాత, విమానం తిరిగి ల్యాండింగ్ కోసం వచ్చిందని, అప్పుడు మళ్లీ పైలట్‌ను ల్యాండింగ్ కోసం రన్‌వే కనిపిస్తోందా అని అడిగారు. దానికి పైలట్ రన్‌వే కనిపిస్తోందని చెప్పడంతోనే ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు కనిపించిందని విమానయాన కేంద్రమంత్రి వెల్లడించారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందడం పట్ల నా హృదయం దుఃఖంతో బరువెక్కిందని, అజిత్ దాదా ఇక మన మధ్య లేరనే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు.
ఈ ఘటనలో మరణించిన మిగతా నలుగురి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అజిత్ దాదా ప్రజా సేవలో తనకున్న అనుభవం కారణంగా తమకు ఎంతో మార్గనిర్దేశం చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇది మహారాష్ట్రకు పూడ్చలేని లోటు అని, ఆయన లాంటి నాయకులను చూడడం చాలా కష్టమని, ఈ తీవ్ర దుఃఖ సమయంలో అజిత్ దాదా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.