29 May, 2026 | 7:53 PM

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెం.1

29-05-2026 03:56 PM

ధాన్యం, మక్కల కొనుగోళ్లలో సిన్సియర్ గా పనిచేస్తున్నాం

చివరిగింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెం.1 అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy ) పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం, మక్కల కొనుగోళ్ల విషయంలో సిన్సియర్ గా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు ఎక్కడా చేయడం లేదని వివరించారు. భారత ప్రభుత్వమే దీనిని అంగీకరించిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ అనికేంద్రం చెబుతోందని తెలిపారు.

పంట మద్దతు ధర కోసం రూ. 16 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు పంటలు పండాయని చెప్పారు. ఐదు పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపామని స్పష్టం చేశారు. చివరిగింజ వరకు మద్దతు ధరతో కొనుగొలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.  యాసంగిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని, కేంద్రం 52మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామని చెప్పిందన్నారు. కేంద్రం కొనకున్నా.. తాము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. 8 వేల 575 కొనుగోలు కేంద్రాల్లో పంటలు కొంటున్నామని వివరించారు. 13 వేల వాహనాలు, 2 లక్షల మందికి పైగా ధాన్యం కొనుగోళ్లలో పాల్గొంటున్నారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

ఇప్పటివరకు 11 వేల 50 కోట్లను రైతులకు చెల్లించామని లెక్కచెప్పారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొంటున్నామని వెల్లడించారు. 60 లక్షల ఎంటీల్లో 9 వేలకు పైగా టన్నుల తడిసిన ధాన్యం ఉందన్నారు. ఇసుక, సిమెంట్ ఫ్యాక్టరీల లారీలు ధాన్యం కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు. బెంగాల్, బీహార్ ఎన్నికల కారణంగా లేబర్ కొరత ఏర్పడిందన్నారు. కూలీలు సొంతూళ్లకు వెళ్లి రాకపోవడంతో కాస్త ఆలస్యమైందని వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్లు గతంలో 7 వేల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తే.. తాము 8 వేల 575 కొనుగోలు కేంద్రాలు పెట్టామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.