20-01-2026 12:00:00 AM
లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ కార్యాచరణ
మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు
పార్టీ బలహీనంగా ఉన్న పురపాలికలపై ప్రత్యేక ఫోకస్
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ మరింత వేగం పెంచింది. మెజార్టీ పట్టణాలను హస్తగతం చేసుకునేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేయగా, పార్లమెం ట్ నియోజక వర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మిగతా 15 నియోజక వర్గాల్లో ఒక్కో పార్లమెంట్‌కు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించారు.
అంతే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపికలోనూ ఎలాంటి పొరపా ట్లు జరగకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని మున్సిపాలిటిల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పార్టీ పరంగా బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కాగా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లు హస్తగతం చేసుకుంటామని రాష్ట్ర మంత్రివర్గం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగుందని, బీఆర్‌ఎస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడటం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. ప్రతి పార్లమెంట్‌కు ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్‌లుగా, పార్లమెంట్ నియోజక వర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్య ర్థులు, సీనియర్ నేతలతో కమిటీ నియమించనున్నారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఈ కమిటీదే కీలకంగా వ్యవహారించనుంది. సర్పం చ్ ఎన్నికల్లో కొన్ని చోట్ల రెబల్స్‌ను బుజ్జగించడంలో విఫలమయ్యామని, ఇప్పుడు పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నందున రెబ ల్స్ బెడద లేకుండా చూడాలని నిర్ణయానికి వచ్చారు.
పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇన్‌చార్జ్ మంత్రులు..
భువనగిరికి సీతక్క, ఖమ్మం కొండా సురేఖ , మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్‌గిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మెదక్ గడ్డం వివేక్, కరీంగనర్ తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, నాగర్‌కర్నూల్ వాకిటి శ్రీహరి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ పి. సుదర్శన్‌రెడ్డి (ప్రభుత్వ సలహాదారు).