06-05-2025 11:46:46 AM
ఇంస్టాగ్రామ్ లో వేధింపులు... మందలించిన మారని బాలుడు
హయత్ నగర్ లోని రంగనాయకుల గుట్టలో విషాదం
ఎల్బీనగర్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్(Hayathnagar Police Station) పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రంగనాయకుల గుట్టకు చెందిన మీనాక్షి అనే (13) మైనర్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు... కనుగూరి విజయ్, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు.వీరి చిన్న కుమార్తె మీనాక్షి ఇటీవల 9వ తరగతి పూర్తి చేసింది. స్థానికంగా ఉంటున్న పానుగోటి రోహిత్ అనే యువకుడు నిత్యం ప్రేమ పేరుతో మీనాక్షిని వేధిస్తున్నాడు.
రోహిత్ తన తమ్ముడి సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి మీనాక్షికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు యువతి తండ్రి విజయ్ తెలిపాడు. రోహిత్ పై చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ అక్కడికి వచ్చి మీనాక్షిని బెదిరించాడని, దీంతో మనస్తాపానికి గురైన మీనాక్షి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో రోహిత్ తిరిగి బెదిరించడంతో మీనాక్షి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు,బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.