10-02-2026 01:51:49 PM
- సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ లభ్యం
సిద్దిపేట క్రైం: కూతురు ఇంటికని బయలుదేరిన ఓ వృద్ధురాలు తప్పిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోలీసులు ఆమె ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్‌కు చెందిన సలేంద్ర హనుమవ్వ (80) అనే వృద్ధురాలు ఈ నెల 5న ఉదయం తన కూతురు మామిండ్ల కనకవ్వ ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరారు.
అయితే ఆమె గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, ఇతర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దాంతో ఈ నెల 7న కూతురు కనకవ్వ సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ లక్ష్మీబాబు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కొమురవెల్లి, వేములవాడ జాతర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ లభించకపోవడంతో, పోలీసులు కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక కెమెరాలో వృద్ధురాలిని గుర్తించిన పోలీసులు, అక్కడి నుంచి వరుసగా వివిధ కెమెరాలను విశ్లేషించారు. చివరగా ఆమె ఒక ఆటోలో ఎక్కి స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లినట్లు నిర్ధారించారు. వెంటనే త్రీ టౌన్ పోలీసులు సదరు వృద్ధాశ్రమానికి చేరుకుని, బాధితురాలిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
తమ తల్లిని క్షేమంగా అప్పగించినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు సిద్దిపేట పోలీస్ కమిషనర్, త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ లక్ష్మీబాబు బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధురాలిని ఆచూకీ కనుగొనడంలో చురుగ్గా వ్యవహరించిన సీసీటీవీ కానిస్టేబుల్స్ జగన్, శ్రీనివాస్, శ్రీకాంత్, త్రీ టౌన్ కానిస్టేబుళ్ళు మంత్రి శ్రీనివాస్, కె.బాబు, ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, విచారణలో సహకరించిన నాగప్రసాద్ లను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.