1 August, 2026 | 12:41 AM

చైతన్యానికి ప్రతీక సాఠే కలం

01-08-2026 12:00 AM

నేడు అన్నాభావు సాఠే జయంతి :

భారతదేశంలో అక్షరాలకు దూరంగా ఉంచిన సమాజంలో పుట్టి, అక్షరాలనే అణగారిన వర్గాల విముక్తి ఆయుధంగా మలిచిన మహోన్నత ప్రజా కవి, రచయిత అన్నాభావు సాఠే. మహారాష్ట్రకు చెందిన మాంగ్(ఎస్సీ) కులంలో 1920 ఆగస్టు 1న ఆయన జన్మించారు. తన జీవితాన్ని శ్రమజీవులు, దళితులు, బహుజనుల హక్కుల కోసం అంకితం చేసిన సాఠే అసలు పేరు తుకారాం భౌరావ్ సాఠే. పేదరికం, కుల వివక్ష చిన్నప్పటి నుంచే ఆయన ఎదుర్కొన్నారు.

పాఠశాల విద్య ఎక్కువగా అందకపోయినా, జీవితాన్నే విశ్వవిద్యాలయంగా మలుచుకొని గొప్ప రచయితగా, కవిగా, జానపద కళాకారుడిగా, సినిమా స్క్రిప్టు రైటర్‌గా, సామాజిక చైతన్యవేత్తగా, అంబేద్కర్ వాదిగా ఎదిగారు. 35కు పైగా నవలలు, వందలాది కథలు, జానపద గీతాలు, నాటకాల ద్వారా అణగారిన వర్గాల జీవితాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రచించిన ‘ఫకీరా’ నవల మరాఠీ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది.

ఇలా తన రచనల ద్వారా కోట్లాది మంది పీడిత ప్రజల గొంతుక గా నిలిచారు. ఆయన కథలు, నవలలు అనేక విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. దళితులు  కష్టాలను ఆయన రచనల్లో అద్భుతంగా చూపించారు. సాఠే పాటలు, నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అన్నాభావు సాఠే మహారాష్ట్ర సంప్రదాయ జానపద కళారూపమైన ‘తమాషా’ పేరుతో సామాజిక చైతన్యం, శ్రామికుల హక్కులు, కులవివక్ష వ్యతిరేక విధానాలపై అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1969 జూలై 18 మరణించారు. ఆయనను రష్యా ‘ఇండియన్ మాక్స్ మ్ గోర్కీ ’గా పిలిచింది. రష్యన్ యూనివర్సిటీలో పాఠాలుగా సాఠే రచనలున్నాయి. దేశవిదేశీయులతో ‘అన్నా’ అని పిలుపునందుకున్న మొదటి భారతీయుడు అన్నాభావు సాఠే. ఇంత గొప్ప మహనీయుని చరిత్ర పట్ల అగ్రవర్ణ ప్రభుత్వాలు, చరిత్రకారులు వివక్ష చూపారు.

దళిత సాహిత్య పితామహుడిగా, సాహిత్య సామ్రాట్‌గా ప్రసిద్ధిచెందిన అన్నా ‘భారతరత్న’కు అర్హుడు. సాఠే ఆలోచనలపై జ్యోతిరావు పూలే సామాజిక విప్లవ భావజాలం, అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రధానంగా కనిపిస్తుంది. అంబేద్కర్ భావజాలాని కి ప్రభావితమై దళిత, బహుజనులను చైతన్యపరిచే రచనలు ఆయన చేశారు. ‘ఫకీరా’ నవలను బాబాసాహెబ్‌కు అంకితం చేశారు.

నేడు భారతదేశంలో మెజారిటీ ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయినప్పటికీ రాజకీయ, ఆర్థిక, విద్యా, పరిపాలనా రంగాల్లో వారికి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం లేదు. ఈ అసమానతలను చాలాకాలం క్రితమే సాఠే తన రచనల్లో ప్రశ్నించారు. ఆయన సాహిత్యం సామాజిక అసమానతలు, కులవివక్ష, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం. సాఠేను కేవలం రచయితగా కాకుండా, సామాజిక మార్పు కోసం కలం పట్టిన ఉద్యమకారుడిగా గుర్తుంచుకోవాలి.

ఆయన ఆత్మవిశ్వాసానికి, హక్కుల సాధనకు దిశానిర్దేశం చేశారు. అందుకే అన్నాభావు సాఠే ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకం. నేడు ఎంతో మంది దళిత, వెనకబడిన వర్గాల కవులు, కళాకారులు, రచయితలు ఉన్నప్పటికీ అన్నభావు సాఠేలాగా విముక్తి రచనలు కనబడవు. ఇప్పటికైనా సాఠే స్ఫూర్తితో బహుజన కవులు, రచయితలు ముందుకెళ్లాలి. ఆయన వారసత్వ జ్ఞానంతో శ్రమజీవులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమై రాజ్యాంగ సమానత్వం దిశగా పోరాటం చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలోనూ 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ భూమి, సంపద, అధికారం మాత్రం అగ్రకులాల చేతిలోనే ఉంది. అణగారిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఆర్థిక, పరిపాలనా రంగాల్లో జనాభా నిష్పత్తికి తగిన అవకాశాలు, ప్రాతినిధ్యం లేదు. ఈ వ్యవస్థాగత అణిచివేతను గుర్తించి తెలంగాణలో బీసీ,ఎస్సీ, ఎస్టీ జేఏసీ రూపంలో ఒక సామాజిక న్యాయ ఉద్యమం బయలుదేరింది.

డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో సాగుతున్న ఈ ఉద్యమం పూలే, అంబేద్కర్, కాన్సీరాం, అన్నాభావు సాఠే సామాజిక, రాజకీయ సమానత్వానికి కొనసాగింపే. సాఠే కలం రగిలించిన చైతన్యం, పూలే వెలిగించిన విద్యాజ్యోతి, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ సమానత్వం సాకారం కావాలి. అదే సాఠేకు నిజమైన నివాళి.

సంపతి రమేష్

 వ్యాసకర్త: సామాజిక విశ్లేషకుడు, 7989579428