రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వినతి
జడ్చర్ల, మే 7 : జడ్చర్లను రెవేన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. రాజాపూర్, ఊర్కొండ మండలాలలో తాసిల్దార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించాలని, జడ్చర్లలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భవనాన్ని, కావేరమ్మపేటలో మహిళా సంఘాలు పెట్రోల్ పంపు నిర్వహించుకోవడానికి 2000 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. హైదరాబాదులో గురువారం జరిగిన సమావేశంలో అనిరుధ్ రెడ్డి ఈ మేరకు వినతి పత్రాలను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించారు.
జడ్చర్ల ప్రజలు చిరకాలంగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కావాలని కోరుతున్నారని, పలుమార్లు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయడానికి జడ్చర్లకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భవనాన్ని నిర్మించాలని కూడా కోరారు. ఊర్కొండ, రాజాపూర్ మండలాల్లో తాసిల్దార్ కార్యాలయాలకు భవనాలను నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీంతో పాటుగా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మ పేటలో సర్వే నెంబర్ 434 లో గల 2000 గజాల స్థలాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు కేటాయించాలని రెవెన్యూ మంత్రిని కోరారు. అనిరుద్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.






