9 August, 2026 | 1:32 AM

పచ్చదనం కోసం ఎంపీని ఆశ్రయించిన ఎమ్మెల్యే

09-08-2026 12:00 AM

సీస్సార్ నిధులు కోరుతూ ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

ఉప్పల్, ఆగష్టు 8(విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలో పచ్చదనం పెంపొందించడానికి సహకరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పరిధిలో నాటిన మొక్కల సంరక్షణ కోసం 30 వేల ట్రీ గార్డులు అవసరమని, వాటి కొనుగోలుకు సుమారు రూ.60 లక్షల సీస్సార్ నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈసీల్ సంస్థకు సీస్సార్ నిధుల ద్వారా ట్రీ గార్డులు లేదా ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ ప్రతిపాదనలకు మద్దతుగా ఎంపీ సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు నాగారం బాబు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమీక్ష 

హెచ్‌ఎంటి నగర్, నాచారం డివిజన్లో చేపడుతున్న పనులపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్షించారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు చేయించాలని సూచించారు. రూ. ఐదు కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.