డివైడర్‌పై మొక్కలు నాటిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
దమ్మపేట, జూన్ 26, (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా దమ్మపేట మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ డివైడర్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా పర్యావరణ యజ్ఞాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ శుక్రవారం మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి , భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని క్రమం తప్పకుండా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, దమ్మపేట ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, చిన్నశెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాక రమేష్, మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






