28 May, 2026 | 2:48 AM

గుండ్ల సింగారం వంతెనకు ఎమ్మెల్యే శంకుస్థాపన

28-05-2026 01:48 AM
  1. ఐదు దశాబ్దాల నిరీక్షణకు తెర..
  2. రూ. 13కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణం

నూతనకల్, మే 27:మండల పరిధిలోని యడవెల్లి గ్రామ పంచాయతీ, గుండ్ల సింగారం సమీపంలో ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారిన పాత వంతెన స్థానంలో నూతనంగా నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి పనులకు బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ ఘనంగా శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్ల క్రితం (1975లో) నిర్మించిన పాత వంతెన కాలక్రమేణా పూర్తిగా దెబ్బతిన్నదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక వైపు కుంగిపోయి ప్రయాణికులకు శాపంగా మారిందని గుర్తు చేశారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు, పాఠశాల విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ప్రజల రవాణా కష్టాలను, భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపి నిధులను మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, యుద్ధప్రాతిపదికన ఈ వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల ఆధునికీకరణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస్ రావు,ఎంపీడీఓ సునిత,మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ ,యడవెల్లి సర్పంచ్ జటంగి సరిత క్రిష్ణ,స్థానిక నాయకులు,పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని వంతెన శంకుస్థాపన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.