5 June, 2026 | 2:34 AM

భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం..

05-06-2026 01:14 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎస్.ఐ.ఆర్. లక్ష్యం

ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం రూరల్(ఖమ్మం), జూన్ 4(విజయక్రాంతి): భవిష్యత్తు తరాల కోసం మనమందరం పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోనీ రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలని అన్నారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంపై సమగ్ర వివరాలు తెలియజేసి, ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువల అభివృద్ధి, సాగునీటి పనుల పురోగతిపై గ్రామస్తులతో చర్చించారు. రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

నానో యూరియా వినియో గాన్ని ప్రోత్సహించాలని సూచించారు.  పంటల మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తూ, వాతావరణ శాఖ అంచనా లను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్న నేపథ్యంలో బోర్వెల్ సౌకర్యం కలిగిన రైతులు షార్ట్ డ్యూరేషన్ వరి సాగు చేపట్టవచ్చని తెలిపారు.

పంటలకు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవిష్యత్ తరాలు మెరుగైన జీవనం సాగించా లంటే పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యమని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఒకేరోజు కుంభవృష్టి తరహా వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయని, అడవుల నరికివేత కారణంగా కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. 

ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం ద్వారా ఓట్లు తొలగిపోతాయనే ప్రచారం పూర్తిగా అపో హ మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి మిగిలిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు.  మండల స్పెషల్ ఆఫీసర్ బి జ్యోతి, ఆత్మ పిడి బి.సరిత, ఏవో ఉమా నగేష్, పశువైద్యులు జగ్గులాల్ సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.