13 June, 2026 | 3:21 AM

దుబాయిలో ‘బుర్జీల్’ ప్రతినిధులను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

13-06-2026 01:59 AM
  1. రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం ప్రకటించిన డా. షంషీర్ 
  2. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (రూ. 26 లక్షలు) సహాయం

జగిత్యాల, జూన్ 12 ( విజయక్రాంతి ) : ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిది మందికి 10 లక్షల దిర్హంలు (రూ. 2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈ కి చెందిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ డా. షంషీర్ వయలిల్ కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతఙ్ఞతలు తెలిపారు.

డా. షంషీర్ వయలిల్ అందుబాటులో లేనందున, ఆయన కంపెనీ ప్రతినిధులు ఎ. విజయ కుమార్, అహ్మద్ బిన్ సులేమాన్, ఎం. ఉన్ని కృష్ణన్, డా. పంకజ్ కుమార్ భట్ లను శుక్రవారం దుబాయిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం, డా. షంషీర్ వయలిల్ తో సహా ’బుర్జీల్’ ప్రతినిధులను హైదరాబాద్ కు ఆహ్వానించారు. సీఎం ఏ. రేవంత్ రెడ్డి సమక్షంలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేద్దామని ప్రతిపాదించారు.

ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో, ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారున్నారు. ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (రూ. 26 లక్షలు) చొప్పున ఆర్ధిక సహాయం అందనున్నది.గాయపడిన తొమ్మిది మందికి వైద్య చికిత్స, పునరావాసం, ప్రభావిత కుటుంబాల పిల్లల విద్య కోసం కూడా సహాయం చేస్తారు.

అంతకు ముందు రోజు ఎమ్మెల్యే దుబాయి లోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి కాన్సులేట్ అధికారులను కలుసుకున్నారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని రాషేద్ ఆసుపత్రిలో పరామర్శించారు. 

కాగా ఎమ్మెల్యే పర్యటనను దుబాయి లోని సామాజిక కార్యకర్తలు గుండెల్లి నర్సింలు, సుతారి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి లు సమన్వయం చేశారు.ఎమ్మెల్యే వెంటతెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్, దుబాయి లోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు జువ్వాడి శ్రీనివాస రావు, శామ్యూల్ దామెర, సలావుద్దీన్, ఎస్వి రెడ్డి, ద్యాగతిమహిపాల్ యాదవ్, సుతారిసత్యనారాయణ, కోరెపుమల్లేష్, ఎమ్మెల్యే పిఎ ముత్యం శంకర్ తదితరులు ఉన్నారు.