ప్రత్యేక ప్రజా దర్బార్ ద్వారా గ్రామాలకే ప్రభుత్వ సేవలు
- పట్టాల పంపిణీతో శాశ్వత భూ హక్కులు
- ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
- భూమి,ఇండ్ల, పెన్షన్లు, సాగునీటి సమస్యలకు వేగవంత పరిష్కారం
- రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు (మహబూబాబాద్) జూన్ 12 (విజయక్రాంతి): రామచంద్రపూర్ భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించనున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికే ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో మల్లంపల్లి మండలంలోని గిత్తూర్ తండా, కొడిశాలకుంట, ముద్దునూరు తండా, రామచంద్రపూర్, భూపాల్నగర్, శివతండ గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజల నుంచి మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రత్యేకంగా రామచంద్రపూర్ గ్రామ పరిధిలో సుమారు 10,600 ఎకరాల భూములకు సంబంధించిన 30 నుంచి 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
భూముల సమస్యల పరిష్కారంతో పాటు రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయ భరోసా కల్పించేందుకు రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించే ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందని, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు మొదటి విడతలో ములుగు నియోజకవర్గానికి 5 వేలకుపైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, రెండో విడతలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించేలా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన వారికి త్వరలోనే నూతన పెన్షన్లు మంజూరు చేసి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, మహిళా సంఘాలకు విశిష్ట గౌరవం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని తెలిపారు.
మహిళలు స్వయం ఉపాధి రంగంలో మరింతగా ఎదగడానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాములు మహిళా సంఘాల వీవో భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. నూతన అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి సమస్యలను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి దరఖాస్తును బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. అంతకుముందు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామ పరిధిలోని యేసునగర్లో సీఆర్‌ఆర్ 2025-26 నిధులతో రూ.19 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును, ఆర్‌అండ్బీ రోడ్డు నుంచి దుర్గామాత ఆలయం వరకు రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే డీఎంఎఫ్టీ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన దుర్గామాత దేవాలయ కాంపౌండ్ వాల్ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం కోయగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్తో కలిసి మెగా శానిటేషన్ డ్రైవ్లో పాల్గొన్నారు. అమ్మ మాట అంగన్వాడి బాట అంగన్వాడీలో పిల్లలను నమోదు చేయండి, వారి భవిష్యత్తుకు పునాది వేయండి అనే నినాదంతో ములుగు ప్రాజెక్టు మల్లంపల్లి సెక్టార్ రామచంద్రపూర్ యేసునగర్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు.
అంగన్వాడీ పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హె. మహేందర్ జీ, ఎం. సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మెన్ బొక్క సత్తిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు పాఠశాలలు, హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హాస్టల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గడిగడ్డ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్ లో మంత్రి సీతక్క కలెక్టర్ స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






