ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే పోచారం
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు, విద్యార్థులు
బాన్సువాడ, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఏర్పాటు చేయించారు. బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళుతుండగా, మార్గమధ్యంలో కిష్టాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద సుమారు 20 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండడం గమనించారు.
వెంటనే వాహనాన్ని ఆపి విద్యార్థులను ప్రశ్నించగా, బస్సులు సమయానికి రాకపోవడంతో ముందుగా బాన్సువాడకు వెళ్లి అక్కడి నుండి మరో బస్సులో ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని తెలిపారు, దీంతో సమయానికి కాలేజీకి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని కళాశాల విద్యార్థులు వాపోయారు.
విద్యార్థుల సమస్యను గమనించిన పోచారం వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ తో ఫోన్లో మాట్లాడి, బాన్సువాడ నుండి ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల వరకు బీర్కూర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్పల్లి చౌరస్తా మార్గంగా ఉదయం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యను విన్న వెంటనే బస్సు సౌకర్యం కల్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.






