స్వర్ణ ప్రాజెక్టు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
నిర్మల్, ఆగస్టు 4 ( విజయ క్రాంతి): సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి కాలువ ద్వారా నీటిని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. రైతుల సాగు కోసం 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల సాగునీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాళ్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
రైతులు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టు గేట్ల వద్ద లీకేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన మరమ్మత్తు పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.






