05-08-2025 08:12:02 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): మంగళవారం హనుమకొండ భవాని నగర్ లోని తన నివాసంలో గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ ధర్మారం కి చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రలోభాలకు, పైరవీలకి తావు ఉండదని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు.
పేదింటి సొంత కళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది, గత ప్రభుత్వ పాలకుల నిర్వాహకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. భారత దేశంలోనే రూ.5 లక్షలతో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే ఏకైక పథకం అని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.