13 August, 2026 | 2:50 AM

రైతుల ప్రయోజనాల కోసం 10 వేల మెట్రిక్ టన్నుల గోదాములు

13-08-2026 01:50 AM

వెలుగుపల్లి మల్లన్న గుట్టలపై నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామేల్

తుంగతుర్తి, ఆగస్టు 12: తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల కోసమే పదివేల మెట్రిక్ టన్నుల గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టలపై గిడ్డంగుల సంస్థల ఆధ్వర్యంలో సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రైతుల ప్రయోజనాల కోసం గోదాముల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంస్థలు, రహదారులు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

తుంగతుర్తి నియో జకవర్గ కేంద్రంలో రూ.29 కోట్ల అంచనా వ్యయంతో కోర్టు భవన నిర్మాణానికి కృషి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోర్టు భవనం అందుబాటులోకి వస్తే న్యాయపరమైన సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని అన్నారు.నియోజకవర్గ కేంద్రంలో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

తిమ్మాపురం నుంచి వెంకే పల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే సామేల్ స్పష్టం చేశారు.నూతనకల్, మద్దిరాల మండలాల పరిధిలోని ఎర్ర పహాడ్ గ్రామ దేశముక్ జేన్నారెడ్డి కుటుంబానికి చెందిన సుమారు 3 వేల ఎకరాల సీలింగ్ భూమిని 2వేల మంది రైతులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

అదేవిధంగా మద్దిరాల మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించడంతోపాటు15వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,పానుగంటి నరసింహారెడ్డి, మద్దిరాల మండల అధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న, నూతనకల్ అధ్యక్షుడు మల్లారెడ్డి,పోలేపాక రామచంద్రు, దాసరి శ్రీను, పాల్వాయి నాగరాజు, దీప్లా నాయక్, నల్లు రామచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.