01-01-2026 12:00:00 AM
కాంగ్రెస్ నేత మృతికి సంతాప సూచకంగా పుట్టిన రోజు వేడుకలు రద్దు
జడ్చర్ల, డిసెంబర్ 31: నిత్యం ఏదో ఒక ప్రత్యేకతతో తన విశిష్టతను చాటుకునే జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన పుట్టిన రోజున ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుని పాడె మోసి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ నేత మృతికి సంతాప సూచకంగా జడ్చర్లలో తన బర్త్ డే వేడుకలను కూడా రద్దు చేసుకోవడం ద్వారా తనకు పుట్టిన రోజు వేడుకల కంటే పార్టీ నేతలు, కార్యకర్తలే ముఖ్యమని చాటారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జన్మదినం బుధవారం డిసెంబర్ 31న కాగా ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి జడ్చర్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేసారు.
అయితే జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ రెండు రోజుల క్రితం గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. గతంలో జడ్చర్ల ఎంపీటీసీగా వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన బాలరాజ్ యాదవ్ మరణంతో 31వ తేదీన ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ అనిరుధ్ రెడ్డి రద్దు చేసుకున్నారు. 31 వ తేదీ బుధవారం రోజునే బాలరాజ్ యాదవ్ అంత్యక్రియలు జరుగుతుండటంతో నేరుగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల చేరుకున్న అనిరుధ్ రెడ్డి బాలరాజ్ యాదవ్ శవయాత్రలో పాల్గొనడంతో పాటుగా ఆయన పాడెను మోసి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
తన పుట్టిన రోజు అని కూడా ఆలోచించకుండా అనిరుధ్ రెడ్డి పాడె మోయడం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలరాజ్ యాదవ్ గారు పార్టీకి, ప్రజాసేవకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన మృతి పార్టీకి, నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యకర్తలంటే తనకు కుటుంబ సభ్యుల్లాంటివారని, వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తాను తోడుగా ఉంటానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.