01-01-2026 12:00:00 AM
దోపిడీలు, మహిళలపై నేరాలు తగ్గుదల
వార్షిక నివేదికలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్
నాగర్ కర్నూల్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, అత్యవసర సేవల్లో విశేష ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో మొత్తం కేసులు స్వల్పంగా పెరిగినా, దొంగతనాలు, మహిళలపై, తీవ్ర నేరాలను కట్టడి చేయడంలో జిల్లా పోలీసుల కృషి దాగి ఉందన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదికను వెల్లడించారు. 2025 ఏడాది జిల్లాలో మొత్తం 4,138 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ముఖ్యంగా దొంగతనాల కేసులు 26 శాతం తగ్గగా, మహిళలపై 20 శాతం, అత్యాచార కేసులు 50 శాతం మేర తగ్గినట్లు పేర్కొన్నారు.
హత్యలు, రాత్రి హౌస్ బ్రేకింగ్ వంటి నేరాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించిందన్నారు. మహిళల భద్రత కోసం పనిచేస్తున్న షీ టీమ్ల ద్వారా 138 పిటిషన్లు స్వీకరించగా, వాటిలో 101 కేసులకు కౌన్సెలింగ్ ఇచ్చి, మిగిలిన కేసులను చట్టపరంగా పరిష్కరించినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్త్మ్రల్ కార్యక్రమాల ద్వారా జిల్లాలోని 63 మంది బాలలను రక్షించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించామని వెల్లడించారు. ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్ను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ల రికవరీలో భాగంగా 796 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశామని తెలిపారు. అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ 9 ఎన్డిపిఎస్ కేసులు నమోదు చేసి 1.901 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 32 మందిని అరెస్టు చేశామని, అలాగే అక్రమ ఇసుక రవాణాపై 240 మందిపై కేసులు నమోదు చేసి 148 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై 97,650 ఈ-చలాన్లు విధించి రూ.3.55 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. దొంగతనాల కేసుల్లో 98 కేసులను ఛేదించి రూ.78 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ ఏడాది జిల్లాలో జరిగిన అతిపెద్ద ఘటనగా ఎస్‌ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల వెలికితీతలో జిల్లా పోలీసులు నిర్విరామంగా పనిచేశారని పేర్కొన్నారు. పండుగలు, పెద్ద జాతరలు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసులు, సీఐలు అశోక్ రెడ్డి, మహేష్, నాగార్జున, ఉపేందర్ రావు, ఆర్‌ఐలు జగన్, రాఘవరావు, జిల్లాలోని ఎస్‌ఐలు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.