01-01-2026 11:49:03 AM
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో న్యూ ఇయర్(New Year's Day) సందర్భంగా పోలీసులు భారీ మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్(Anti-drug operation) నిర్వహించారు. అరెస్టు అయిన ఏడుగురిలో ఒక డాక్టర్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) విద్యార్థి ఉన్నారు. అట్టింగల్, నెడుమంగాడ్ రూరల్ డ్యాన్సాఫ్ (District Anti-Narcotics Special Action Force) బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక అద్దె ఇంట్లో నుంచి ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ఏడుగురిని డాక్టర్ విఘ్నేష్ దత్తన్, బీడీఎస్ విద్యార్థిని హలీనా, అసిమ్, అవినాష్, అజిత్, అన్సియా, హరీష్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, అవినాష్ ఒక ఐటీ ఉద్యోగి అని, అలాగే అసిమ్, అజిత్, అన్సియా గతంలో కూడా పలు మాదకద్రవ్యాల కేసులలో నిందితులుగా ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.
దాడుల సమయంలో పోలీసులు సుమారు నాలుగు గ్రాముల ఎండిఎంఏ, ఒక గ్రాము హైబ్రిడ్ గంజాయి, 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైబ్రిడ్ గంజాయిని గ్రాముకు రూ. 3,000 చొప్పున విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు రెండు కార్లు, రెండు బైక్‌లు, పది మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రహస్య సమాచారం అందిన తర్వాత, కనియాపురం తోప్పిల్ ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ బృందం బెంగుళూరు నుండి ఎండీఎంఏ, ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేసి పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పదార్థాలను విద్యార్థులకు, వైద్యులకు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.