18-07-2025 12:46:48 AM
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్ట్ అని, బీఆర్‌ఎస్ వాళ్లు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం తప్పని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘బీఆర్‌ఎస్ నా దారికి రావాల్సిందే, నాలుగు రోజులు టైం తీసుకుంటారంతే’ అని సంచలన కామెంట్లు చేశారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే, తాను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు సపోర్టు చేశానని కవిత స్పష్టం చేశారు.
తనపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లపై పార్టీ రియాక్ట్ కాలేదని, అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా అని కవిత అన్నారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్ట్ అన్నారు. కవిత చేసిన ఈ కామెంట్లతో బీఆర్‌ఎస్ పార్టీకి ఆమెకు మరింత దూరం పెరిగిందన్న చర్చ పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో నడస్తోంది.
బీసీ లు, ఇతర కార్యక్రమాలపై పోరాడుతుంటే పార్టీ నుంచి తమకు నైతిక మద్దతు లేదని ఆమె మద్దతుదారులు వాపోతున్నారు. మొత్తానికి కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఆమె పార్టీలో కొనసాగుతారా లేక పార్టీనే ఆమెను క్రమక్రమంగా దూరం పెడుతుందా అనేది కాలం సమాధానం చెప్పే అంశమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కవితను దూరం పెడుతున్నారా?
ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్ పార్టీ దూరం పెడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణా మాలను గమనిస్తే కవిత తెలంగాణ జాగృతి పేరుతో తనదైన ఎజెండాతో, తనదైన శైలిలో కార్యక్రమాలను చేపడుతోంది. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడంతో పార్టీలో సంచలన సృష్టించింది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని చేసిన కామెంట్ కాని, పార్టీలో తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తానన్న కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి.
ఆ తర్వాత కవిత చేపడుతున్న కార్యక్రమాలకు గులాబీ క్యాడర్, పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కవితకు పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వాదనను బలం చేకూరేలా అనేక ఘటనలు ఇటీవల చోటు చేసు కుంటున్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై కవిత అనేక కార్యక్రమాలను నిర్వహిం చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని కవిత స్వాగతించారు.
అది తమ జాగృతి ఘనతేనని ఆమె చెప్పుకుంటే అటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలమో అది బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్య అంటూ మండిపడ్డారు. ఈ రకంగా ఒకే పార్టీలో రెండు రకాల ఓపినియన్స్ ఉండటంతో అటు క్యాడర్‌లో అయోమయం సృష్టించినట్లుంది. బీసీల అంశంపై కవిత సొంతంగా కార్యక్రమాలను చేపడుతూ బీసీ సంఘ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్‌ఎస్ పరంగా చేపట్టే కార్యక్రమాల్లో కవిత కనపడటం లేదు. ఆమెకు ఆహ్వానం ఉండడం లేదా అనే అంశంపై పార్టీ వర్గాలు స్పందించడం లేదు. ఇక తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ లో కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించడం, మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి, గన్‌మెన్ల ఫైరింగ్ తీవ్ర సంచలనం కలిగించాయి. అయితే కవితపై మల్లన్న వాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం లాంటి వారు తప్పుబట్టారు.
కానీ సొంత పార్టీలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మల్లన్న కామెంట్లను ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారే తప్ప పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల నుంచి ఖండనలు, స్పందనలు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పార్టీ నేతల స్పందన లేకపోవడంతో కవితను కారు పార్టీ దూరం పెడుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
టీబీజీకేఎస్‌తో మరింత దూరం
ఇక తాజాగా సింగరేణిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత పదేళ్ల పాటు వ్యవహరించారు. ఆమె స్థానంలో మాజీమంత్రి కొప్పు ల ఈశ్వర్‌ను నియమిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మికు ల సంఘ సమావేశంలో పదేళ్ల పాటు సంఘ కార్యక్రమాలను పర్యవేక్షించిన కవితను ఆహ్వానించకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. అయితే అంతకు కొన్నిరోజుల ముందు కవిత కూడా సింగరేణి లో జాగృతి కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.