10 April, 2026 | 9:24 AM

ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించాలి

07-02-2025 04:44 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఎన్నికల నిర్వహణ కొరకు 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టభద్రులు 6137, ఉపాధ్యాయులు 470 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. రాజకీయ పార్టీలకు పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాలను అందజేస్తామని తెలిపారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, షామియానాలు, వెలుతురు, ఫ్యాన్లు మిగతా వసతుల ను కల్పిస్తామన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ రోజు పాల్గొనే ఏజెంట్ల జాబితాను అందజేయాలని సూచించారు. కౌంటింగ్ మార్చి 3న కరీంనగర్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎన్నికల పర్యవేక్షకుడు సునీల్, డిటి శ్యామ్ లాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.