10 April, 2026 | 3:47 AM

23 నుంచి ఆర్టీసీ సమ్మె?

10-04-2026 01:58 AM

లేబర్ కమిషనర్ వద్ద భేటీకి గైర్హాజరైన ఆర్టీసీ అధికారులు

13న మళ్లీ చర్చలు 

ఆ రోజూ ఆర్టీసీ యాజమాన్యం రాకుంటే సమ్మె తేదీని ప్రకటిస్తామంటున్న జేఏసీ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమ లు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసులపై గురువారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

ఈ చర్చలకు ఆర్టీసీ అధికారులు గైర్హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు చర్చలు వాయిదా పడ్డాయని, ఈ నెల 13న కూడా ఒక వేళ చర్చలు విఫలమైతే ఈనెల 23 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బీ యాదగిరి కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ సునీత గోపాల్ దాస్‌తో సమ్మె నోటీసులపై భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో ఈదురు వెం కన్న, థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉన్నతాధికారులు రాకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయని తెలిపారు. కావాలనే ఆర్టీసీ ఉన్నతాధికారులు రాలేదని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే సోయి అసులులేదని విమర్శించారు. చర్చలకు వెళ్లాలని ఆర్టీసీ అధికారులకు ప్రభు త్వం నుంచి అనుమతి రాకపోయి ఉండొచ్చని, అందుకే అధికారులు చర్చలకు డుమ్మా కొట్టారని అన్నారు. ఒకవేళ ఈనెల 13న కూడా చర్చలకు రాకుంటే అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని జేఏసీ నేతలు చెప్పారు.

ప్రభుత్వం కావాలని దాటవేస్తూ, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అటు ఆర్టీసీ, ఇటు ప్రభు త్వం కూడబలుక్కొని చర్చలకు రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేనికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులిచ్చి నెల రోజులు కావొస్తు న్నప్పటికీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెను నివారించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఇదే వైఖరి కొనసాగితే ఏప్రిల్ 13న సాయం త్రం 4 గంటలకు నిర్వహించే చర్చలు విఫలమైతే, అదేరోజు సమ్మె తేదీని ప్రకటించి సమ్మెకు వెళ్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

ఇప్పటికే రెండు సార్లు ఈ చర్చలు వాయిదా పడ్డాయి. మార్చి 13న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 25న ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలకు రావాలని లేబర్ కమిషన్ మార్చి 20న పేర్కొంది. అప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు గైర్హాజరవడంతో వాయిదాపడ్డాయి. గురువారం కూడా ఆర్టీసీ అధికారులు డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే జేఏసీ నేతలు ఈనెల 10న చలో లేబర్ ఆఫీస్, కార్మిక గర్జనకు ఈనెల 6వ తేదీన పిలుపునివ్వడంతో ఈనెల 9న చర్చలకు ఇరుపక్షాలను పిలిచారు. దీంతో శుక్రవారం నిర్వహించే కార్మిక గర్జనను వాయి దా వేశామని జేఏసీ నేతలు తెలిపారు.