17 July, 2026 | 12:47 AM

అక్రమ సీ అండ్ డీ వ్యర్థాల డంపింగ్‌పై ఉక్కుపాదం

17-07-2026 12:00 AM

చెత్త లేకుండా నిర్వహించాలని ఆదేశం..

వాణిజ్య సంస్థలకుట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి..

బేగంపేట, ప్రకాశ్ నగర్‌లో ఎంఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ 

సికింద్రాబాద్,జూలై 16 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్, ఇంజినీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు , రామ్కీ, ఈపీటీఆర్‌ఐ సిబ్బందితో కలి సి బేగంపేటప్రకాశ్ నగర్ ప్రాంతంలో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి పారిశుద్ధ్యం, పౌర మౌలిక వసతులు, నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఫుట్పాత్లు చెత్త, ఆక్రమణలు, ఇతర అడ్డంకులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టి పాదచారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని వాణిజ్య సం స్థలు తమ ట్రేడ్ లైసెన్స్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని, హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రా లు ఉత్పత్తి చేసే ఆహార వ్యర్థాలను అధీకృత ఫుడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సంస్థకే అప్పగించాలని, బహిరంగ ప్రదేశాల్లో లేదా సాధారణ మున్సిపల్ చెత్తతో కలిపి పారవేయ రాదని స్పష్టం చేశారు.తనిఖీ సందర్భంగా రహదారి పక్కన అక్రమంగా పారబోసిన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలును గుర్తించిన కమిషనర్ సంబంధిత ఆస్తి యజమానిని ప్రశ్నించగా వ్యర్థాల తొలగింపు బాధ్యతను బిల్డర్కు అప్పగించినట్లు తెలిపారు.

అనంతరం బిల్డర్ను విచారించగా, అధీకృత సంస్థకు బదులుగా అనధికార రవాణా వాహనాలను వినియోగించినట్లు వెల్లడైంది. దీనిపై వెంటనే స్పందించిన కమిషనర్.అక్రమంగా పారబోసిన సి అండ్ డి  వ్యర్థాలను మౌలాలి, అమ్ముగూడ ప్రాంతంలోని అనధికార డంపింగ్ స్థలంలో గుర్తించి, సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే సంబంధిత డిప్యూటీ కమిషనర్కు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా నిర్వహించాలని, అక్రమ డంపింగ్ను పూర్తిగా అరికట్టేందుకు కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా పారబోసే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఎలాంటి మినహాయింపు లేకుండా స్వాధీనం చేసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పరిశుభ్రమైన, సురక్షితమైన, బాధ్యతాయుతమైన నగర నిర్మాణానికి ప్రజలు, నిర్మాణ సంస్థలు, వ్యాపారులు, సంబంధిత శాఖలు సమిష్టిగా సహకరించాలని కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి  పిలుపునిచ్చారు.