28-10-2025 12:01:48 AM
కందుకూరు అక్టోబర్ 27 : అద్భుతమైన విద్యా విధానాలను పాటించినందుకు ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు నేదునూరు మోడల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపల్ విష్ణుప్రియకి వరించింది. సోమవారం పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఆమె సన్మానం,ప్రశంసా పత్రం అందుకున్నారు. కందుకూరు మండల నేదునూరు మోడల్ స్కూల్,కళాశాల ప్రిన్సిపల్ గా పని చేస్తున్న విష్ణు ప్రియ సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.
విద్య పట్ల అచంచలమైన అంకిత భావం, అసాధారణమైన నిబద్ధతకు,గుర్తింపుగా విద్యార్థుల విజయం, శ్రేయస్సు, సమగ్రమైన అభివృద్ధిని, నిస్వార్థంతో చేస్తూ విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న వనరులతో మద్దతు ఇవ్వడం విద్యార్థులను విజయం వైపు నడిపించడం, మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని, విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమెను అర్హులుగా భావించి,మోడల్ స్కూల్ ఎడి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ చేతులమీదుగా అవార్డును అందజేశారు.
ఈసత్కారం అందుకున్నందుకు గాను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సంయుక్తంగా ప్రిన్సిపాల్ ను సత్కరించుకున్నారు. ప్రిన్సిపాల్ దార్శనికత, నాయకత్వం, అంకితభావం, అవిశ్రాంత కృషి,మా పాఠశాలను ఉత్కృష్టత, ప్రేరణ యొక్క నమూనాగా మార్చాయని ఉపాధ్యాయ బృందం కొనియాడారు. ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నాజీవితంలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్‌గా భావిస్తానన్నారు. అందుకు సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, పరమేష్, గురురాజారెడ్డి, పుష్పలత, కుముదిని, వెంకటరమణ మొదల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.