బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్
జూన్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ
జూలై 3న సెలక్షన్ జాబితా
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. 2024 విద్యాసంవత్సరానికి ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 1 నుంచి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 22 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్‌కు తుదిగడువుగా అధికారులు తెలిపారు. పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్‌సీసీ కోటా విద్యార్థులు దరఖాస్తులను జూన్ 29 వరకు పంపించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 3న విడుదల చేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జూలై 8 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకునేవారికి ఏమైనా సందేహాలుంటే మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.inని సందర్శించాలని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి మన సీట్లు మనకే..
బాసర ట్రిపుల్ ఐటీలో ఏటా 1,500 వరకు సీట్లను భర్తీ చేస్తున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే రెండేళ్లు పీయూసీ (ఇంటర్)తోపాటు నాలుగేళ్లు ఇంజినీరింగ్ కోర్సు చదువు కునేందుకు అవకాశం ఉంటుంది. టెన్త్‌లో వచ్చే మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. టెన్త్‌లో 10 జీపీఏ వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. విభజన చట్టంలో భాగంగా ఈ ఒక్క ఏడాదికి మాత్రమే బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడనున్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 75 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.37 లక్షలు చెల్లించి అడ్మిషన్ పొందే వీలుంది.






