19 April, 2026 | 12:51 PM

ప్రజలను మభ్యపెడుతున్న మోదీ

09-05-2024 02:35 AM

మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి

గజ్వేల్, మే 8 (విజయక్రాంతి): ఎప్పుడో జరిగిపోయిన చరిత్రను ఎన్నికల ప్రచారంలో చెబుతూ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ మభ్య పెడుతున్నాడని మాజీ ఐఎఎస్ అధికారి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకు నూరి మురళి అన్నారు. జాగో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ల చైతన్యబస్సు యాత్ర బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మోదీ పాత చరిత్ర, మతాలను ప్రస్తావిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నా రని, తాను చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పడం లేదన్నారు. రాష్ట్రం నుంచి రూ. 12లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసి రాష్ట్రానికి నిధులు ఖర్చు చేయలేదన్నారు.

కార్పొరేట్ల అప్పులను రద్దు చేయడం ద్వారా 16లక్షల కోట్లను వసూలు చేసి అదాని, అంబానీలాంటి కంపెనీలకు దేశ సంపదను దోచి పెట్టారన్నారు. సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానని, నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని పేదల ఖాతాల్లో వేస్తానని ఇచ్చిన హామీ మోదీ మరిచారన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీకి ఈసారి ఓటు రూపంలో బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, పద్మజ, జానయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులికల్పన, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు యూత్‌లీడర్ పులినవీన్ పాల్గొన్నారు.