28 July, 2026 | 7:25 AM

వాళ్లంటే పాక్‌కు ఎందుకు ఇష్టమో!

28-05-2024 12:05 AM

మన శత్రువులు మద్దుతు ఇవ్వడమేంటి?

మన ఓటర్లు ఇవన్నీ పట్టించుకోరు 

రాహుల్, కేజ్రీపై మోదీ ఫైర్

న్యూఢిల్లీ, మే 27: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పాక్ నుంచి మద్దతు ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థకు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నకు మోదీ సమధానం చెబుతూ.. భారత్‌లో ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఎంతో పరిణితి చెందింది. దేశంలో ఆరోగ్యకరమైన సంప్రదాయాలు ఉన్నాయి. బయటి అంశాలు ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయలేవు. ఇది చాలా లోతుగా విచారించాల్సిన విషయం. మనతో శత్రుత్వం ఉన్నవారు కొంతమందిని మాత్రమే ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు తెలియదు. ఆ కొద్దిమంది కోసమే అక్కడి వారు గొంతు ఎందుకు ఎత్తుతున్నారో అర్థం కావట్లేదు. నేనున్న స్థానంలో ఇలాంటి అంశాలపై మాట్లాడటం సరికాదు. కానీ మీ ఆందోళన అర్థం చేసుకోగలను అని చెప్పారు. 

రాజకీయ దుమారం..

పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరీ.. కేజ్రీవాల్‌కు  సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరైన సందర్భంగా ట్వీట్ చేశారు. మోదీ మరో యుద్ధం ఓడిపోయారని, కేజ్రీవాల్ విడుదలయ్యారని పేర్కొన్నారు. అనంతరం మే 25న ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఓటు వేసిన ఫొటోను ప్రశంసిస్తూ మరో ట్వీట్ చేశారు. శాంతి, సామరస్యం.. ద్వేషం, తీవ్రవాద శక్తిని ఓడించాలని పేర్కొన్నారు. దీంతో కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఫవాద్ ట్వీట్లపై కేజ్రీవాల్ కూడా ఘాటుగా స్పందించారు. ఫవాద్ సాబ్.. నేను, నా దేశ ప్రజలు మా సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే శక్తి మాకుంది. మీ మద్దతు, ట్వీట్లు మాకు అవసరం లేదు. ప్రస్తుతం పాక్ పరిస్థితి భయంకరంగా ఉంది. మీరు మీ సొంత దేశాన్ని ముందు బాగు చేసుకోండి అని రిప్లయ్ ఇచ్చారు. అంతకుముందు రాహుల్‌గాంధీకి మద్దుతునిస్తూ కూడా ఫవాద్ ట్వీట్ చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుపడ్డ విషయం తెలిసిందే.