జైలు నుంచే గెలుపు
లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల విజయం
న్యూఢిల్లీ, జూన్ 5: లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు జైలు నుంచే పోటీచేసి విజయం సాధించారు. అది కూడా తీవ్రమైన ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటు న్నవారు కావటం గమనార్హం. సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖతూర్‌సాహిబ్ స్థానం నుంచి విజయం సాధించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో జైల్లో ఉన్న షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి గెలుపొందారు. 2019 ఆగస్టు 9 నుంచి రషీద్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. అమృత్‌పాల్‌సింగ్‌ను అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ఆయన ఇప్పుడు అస్సాంలోని దిభ్రుగఢ్ జైల్లో ఉన్నాడు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ జైల్లో వీరికి పార్ల మెంటుకు హాజరయ్యే హక్కు ఉంటుందా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నది.
అయితే, రాజ్యాంగం ప్రకారం జైల్లో ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. జైలు అధికారుల అనుమతితో పోలీసుల భద్రత మధ్య వెళ్లి పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేసేందుకు కూడా వారికి హక్కులు ఉంటాయని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీగా ఆచారి తెలిపారు. అయితే, ప్రమాణం చేసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 (4) ఈ అంశం గురించి తెలుపుతున్నదని చెప్పారు. జైల్లో ఉన్న అభ్యర్థులు ప్రమాణం చేసిన తర్వాత తాము సమావేశాలకు హాజరు కాలేకపోతున్నట్టు, అందుకు కారణాలను వివరిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు తెలుపాలి. ఆ సమాచారాన్ని స్పీకర్ హౌస్ కమిటీకి చేరవేస్తారు. అప్పడు సదరు సభ్యుడు సమావే శాలకు హాజరు కాకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సిఫారసులు చేస్తుంది. ఆ సిఫారసులపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. వచ్చిన ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకొంటారు.






