కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటిన మోక్షదృతి
ఘట్‌కేసర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని బిర్లా ప్లానిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శ్రీసీతారామ కల్యాణ వైభోగం సంగీత నృత్య నిరాజనం కార్యక్రమం కళా ప్రియులను ఆకట్టుకుంది. సాంప్రదాయ సంగీతం, నృత్యాలతో సాంస్కృతిక వాతావరణం నెలకొన్న ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్ ఎఫ్ సీ నగర్ కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి మోక్ష దృతి తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
రామాయణంలోని సీతారాముల కల్యాణ ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని ఆమె అందించిన నృత్య రూపకం భావప్రధానంగా, సాంప్రదాయ సౌందర్యంతో నిండినదిగా నిలిచింది. ప్రత్యేకంగా ఆమె అభినయం, లయబద్ధత, అంగికాభినయాలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయి. ఈ సందర్భంగా మోక్ష దృతిని కోదండ రామ అవార్డుతో పాటు జ్ఞాపికతో సత్కరించారు. ఆమె ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలను చేరాలని ఆశీర్వదించారు.
కళా సాహిత్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువ కళాకారులకు మంచి వేదిక కల్పించబడుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రసమయి అధ్యక్షులు ఎం.కే. రాము, తెలంగాణ జాగృతి ఫౌండేషన్ అధ్యక్షులు పద్మ వెంకటేష్, స్నాగీతికా కళానిలయం అధ్యక్షులు అనిత ప్రియదర్శిని, కవి-గాయకులు ఓయూ జేఏసీ నాయకులు దరువు అంజన్న, ఓయూ ప్రొఫెసర్ జయశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు కార్యక్రమాన్ని అభినందిస్తూ తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.




