20 March, 2026 | 6:34 AM

ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు

20-03-2026 12:21 AM
  1. ప్రజలపై పెరుగుతున్న రుణ భారం

అధిక వడ్డీతో మధ్యతరగతి ప్రజల పై విరుచుకు పడుతున్న వ్యాపారులు 

సిరికొండ, మార్చి, 19 (విజయ క్రాంతి): సిరికొండ మండలంలో అక్రమ అధిక వడ్డీ వ్యాపారుల దందా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ వడ్డీ వ్యాపారులు ప్రజల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దిక్కుతోచని స్థితిలో సమస్య నుండి బయటపడడానికి చేసే రుణ ప్రయత్నంలో ప్రజలు ఈ అధిక వడ్డీ ఉచ్చులో బిగిసుకుంటున్నారు.

అవసరాన్ని ఆశగా కుంటున్న వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీతో లెక్కలు కట్టి ప్రజల నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు అధిక వడ్డీల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నెలకు 5 నుండి 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అప్పు తీర్చలేకపోతే వడ్డీ మీద వడ్డీ వేస్తూ ప్రజలపై మరింత రుణభారం మోపుతూ ఉండడంతో వ్యాపారుల ఒత్తిడికి అప్పు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు.

మరికొందరు వడ్డీ వ్యాపారులు అప్పు కై వచ్చిన వారి ఆస్తులు ఏకంగా అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పులు ఇస్తున్నారు. నిర్ణీత గడువులో డబ్బు చెల్లించకుండా ఏమాత్రం ఆలస్యం జరిగినా రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థిరాస్తులను ఇతరులకు అమ్మేస్తున్నారు.   ఈ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో బిగుసుకున్న వారి జీవితం మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోతోంది.  మండలంలో అత్యవసర వైద్యం, పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు వంటి అవసరాల కోసం చాలా మంది బ్యాంకులకు వెళ్లినా సరైన సమయంలో రుణాలు అందకపోవడంతో చివరికి ఈ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ పరిస్థితిని కొంతమంది వడ్డీ వ్యాపారులు వారి అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని అధిక వడ్డీలతో డబ్బులు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు.అప్పు తీసుకున్న వారికి తిరిగి చెల్లించడంలో ఆలస్యం అయితే ఒత్తిడి పెంచడం, ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం, కొన్నిసార్లు అవమానకరంగా ప్రవర్తించడం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారణంగా గౌరవంగా బతికే కొన్ని  కుటుంబాలు ఆర్థికంగా, పరువు పరంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మరికొన్ని కుటుంబాలు చిన్నభిన్నం మవుతున్నాయి. మరికొందరు అధిక వడ్డీలు చెల్లించలేక రుణం పొందిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఇంటి పెద్దదిక్కు ఆత్మహత్యల పాల్పడుతున్నారు. మండలంలో వడ్డీ వ్యాపారం నియంత్రణ లేకుండా సాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించి వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మండలంలో అప్పుల బారిన పడిన కుటుంబాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.