దోమల నివారణ చర్యలు చేపట్టాలి
23-07-2026 12:21 AM
నాగలిగిద్ద, జూలై 22: నాగలిగిద్ద మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి ఎంపీడీవో మహేశ్వర రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ, వర్షాకాలంలో గ్రామాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో విషపురుగులు, దోమలు విస్తరిస్తున్నాయని తెలిపారు.
గ్రామ పంచాయతీల ద్వారా గడ్డి మందు పిచికారీ చేయడం లేదా కార్మికులతో గడ్డిని తొలగించి మురుగు కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు తుక్కారం రమేష్ పాల్గొన్నారు.






