17 August, 2026 | 1:16 AM

తల్లీకుమారులు.. వరుస హత్యలు

17-08-2026 12:41 AM

మరో నాలుగు మర్డర్లకు ప్లాన్,  డబ్బు సంపాదనే లక్ష్యం

రామక్కపేట కేసును ఛేదించిన పోలీసులు , నిందితుల్లో ఒకరు మైనర్ 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 16(విజయక్రాంతి) : సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో వరుస హత్యలకు పాల్పడిన తల్లి, కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఆస్తి తగాదాలు, ఇతర గొడవలు ఉన్న వ్యక్తులు,ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దోచుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా తీశారు. ఇప్పటికే రెండు హత్యలకు పాల్పడగా, మరో నలుగురిని టార్గెట్ గాఎంచుకున్నట్టు వెల్లడైంది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం పోలీస్ కమిషనరేట్ లో సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ నెల 8న రామక్కపేట గ్రామానికి చెందిన వనం నర్సయ్య పొలం దగ్గర రోడ్డు పక్కన పాక్షికంగా కాలిన  గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం కనిపించిందన్న ఫిర్యాదుమేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులతోపాటు సీసీఎస్, ట్రాన్స్పోర్ట్ తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు.

మహిళను హత్య చేసి కాల్చినట్టుగా పోలీసులు నిర్దారించారు.మృతదేహం భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ(45) గా గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అదే గ్రామానికి చెందిన తల్లి, కొడుకు కలిసి హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. నిందితుల ఇంటికి సమీపంలో విజయ ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 8న సాయంత్రం నిందితులు తమ కిరాణం షాప్ లోకి పిలిచి విజయ గొంతు నులిమి చంపారు.

ఆదేరోజు రాత్రి శవాన్ని టీవీఎస్ ఎక్స్‌ఎల్  వాహనంపైరామక్కపేట గ్రామ శివారుకు తరలించి రోడ్డు పక్కన పెట్రోల్ పోసి కాల్చివేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. గతేడాది మే 28నడబుల్ బెడ్రూంలలో నివాసముంటున్న కుంట రేఖను కూడా చంపి అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాల్చివేశారని విచారణలో వెల్లడైంది. గతేడాది జూన్ లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ అనే మహిళ ఉదయం వాకింగ్ చేస్తుండగా, ఆమెను కొట్టి మెడలోవున్న 5 తులాల పుస్తెలతాడునుదొంగిలించారు.

నిందితుల నుంచి 5.61 తులాల బంగారు, 53 తులాల వెండి ఆభరణాలు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం, రూ.లక్షా మూడు వేల నగదు, రెండు మొబైలు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్టు సీపీ తెలిపారు. మరో నలుగురు టార్గెట్: టీ పాయింట్ల వద్ద కూర్చుని గ్రామంలోని వారి ఆస్తులు, గొడవలను పరిశీలించే ఈ ముఠా.. త్వరలోనే మరో నలుగురిని అంతమొందించేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

వారం వ్యవధిలో కేసును ఛేదించిన సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సీఐ రాజేష్,ఎస్‌ఐ కీర్తిరాజు, భూంపల్లి, మిరుదొడ్డి ఎస్‌ఐలు రాజశేఖర్, సతీష్ , సైఫ్‌అలీ, సీసీఎస్ సదన్ కుమార్, ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందిచారు.