06-01-2026 12:42:25 AM
పోరాటాలకి సలాం.. పైరవీలకి గులాం
కోట్లకు పడిగెత్తిన కార్మిక నేతలు...
ఇదీ సింగరేణి యూనియన్ సంఘాల లీడర్ల తీరు...
సింగరేణిలో కార్మిక సంఘాలు పోరాటాలకు సలాం కొట్టి గులాంగిరినే మార్గంగా ఎంచుకున్నారు... అధికారులను జోకుతూ పైరవీకార సంఘాలుగా, అవినీతిలో జోగుతున్నారన్న విమర్శలు సింగరేణిలో సర్వత్రా వినిపిస్తున్న నిత్య సత్యాలు... కార్మికుల పేరిట సంఘాలను ఏర్పాటు చేసుకొని తొలుత పోరాట పంథాలో సాగిన కార్మిక సంఘాలు నాలుగు పైసలు వెనుక వేసుకుని ఇక పోరాటాలకు స్వస్తి పలికి యజమాన్యం ఇచ్చే పైరవీలకు ఆశపడుతున్నారడంలో ఎలాంటి సందేహాలు లేవు... కార్మికుల సేవలు వదిలి.., సింగరేణి అధికారులకి సేవలు అందించే పనిలోనే నిమగ్నమయ్యారు. కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా మారిపోయారు... కంపెనీ పనుల వాటాల కోసమే సంఘాలను నడుపుతున్నారన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో ప్రధాన సంఘాల అగ్రనేతలందరు దీనికి అతీతులేనని కార్మికులు బహాటంగానే చెబుతున్నారు.
బెల్లంపల్లి అర్బన్, జనవరి 5: సింగరేణిలో పైరవీలు చేస్తూ నాలుగు రూపాయలు వెనుకేసుకుంటున్నారనే విమర్శలు కార్మికుల్లో బాహాటంగానే వినబడుతున్నాయి. కార్మిక సంఘాల నాయకులు పైరవీల్లో డిగ్రీలు పొంది కార్మిక సంఘాల నాయకులుగా చలామణి అవుతున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. కార్మి కులకు సేవలు చేసి, వారికి హక్కులు సాధించిపెట్టి కార్మిక సంఘాలు అలిసిపోయాయి. తమ జీవితాలను కార్మికుల సేవకే పణంగా పెట్టిన ట్టు సంఘాల నాయకుల బిల్డప్‌లకు ఏమీ తక్కువ లేదు. అందుకే కాబోలు అలసి సొలసిన కార్మిక సంఘాల నేతలు సేద తీరుతు న్నట్లు ఉండిపోతున్నారు.
ఇంతకాలం సింగరేణి కార్మికులకు చేసిన సేవలకుగానూ ప్రతిఫలంగా కార్మిక సంఘాల నాయకులు నాలుగు పైసలు కూడగట్టుకునే పనిలో అలుపెరుగని బిజీలో పడిపోయారు. అందుకే ఈ మధ్యకాలంలో సింగరేణిలో కార్మిక సమస్యలపై స్పందించే తీరికలేకుండా పోయింది వారికి. వారి వ్యవహారాన్ని గమనించిన కార్మికులు, ప్రధాన కార్మిక సంఘాల నాయకులను పైరవీకారులు అని బాహాటంగానే వ్యవహరిస్తు న్నారు. అందుకే ఏదైనా గని ప్రమాదంలో కార్మికులు చచ్చినా, బతికినా అక్కర లేకుండా పోయింది. సింగరేణి యాజమాన్యం గనులను అమ్మినా, వేలం వేసినా, వారికి ఏమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు...
సమస్యలను పట్టించుకోని సంఘాలు
సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన కార్మిక సంఘాల నాయకు లు ఉలుకూ పలుకు లేకుండా ఉంటున్నారు. కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సొంతింటికల, కార్మికుల జీవితాలపై కుంపటిగా మారిన ఐటీ, వేతనాల్లో సీలింగ్, మెడిక ల్ బోర్డులో అవినీతి, ప్రమోషన్లూ, వైద్యం సదుపాయాల్లో కొర్రీలు, రిటైర్డ్ కార్మికులకు పెరుగని పెన్షన్, సింగరేణి పాలైన వేలాది రూపాయల గ్రాడ్యూటీ, కానరానీ కాంట్రాక్టు కార్మికుల హైపర్ కమిటీ వేతనాల తీర్పు వంటి మౌలికమైన సమస్యలతో కార్మికులు సతమతమవుతున్నారు.
వీటికి అదనంగా నిత్యం సింగరేణిలో అధికారుల వేధింపులు పెట్రేగిపోయా యి. అక్రమ చార్జిషీట్లూ, వేధింపులు, పనిభా రం, ప్రధానంగా గనుల్లో రక్షణ కరువై బొగ్గు గనులు కార్మికులకి ప్రాణ సంకటంగా మారా యి. ఏ రకంగా చూసినా సింగరేణి కార్మికులు పుట్టెడు కష్టాల్లో కాలం వెళ్లదీస్తున్నారన్నది మాత్రం వాస్తవం. ఎటు చేసీ కార్మికులు, సింగరేణి సంస్థ ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు సంఘాల నాయకుల వ్యవహారం ఉంది.
అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకుని..
సింగరేణిలో కార్మిక సంఘాలు అధికారులను జోకుతూ కాలం వెల్లదీస్తున్నారు. ‘రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించిన చక్రవర్తి’ చందం సింగరేణి సంఘాలకు అద్దినట్టుగా ఉంటది. ఏదేమైనా తమ ప్రయోజ నాలకీ మాత్రం భంగం వాటిల్ల కుండా కంపెనీ సేవలో, స్వామి కార్యం స్వాహా కార్యంలో తేలియాడుతున్నారు. సింగరేణిలో కార్మిక సంఘా ల లీడర్లది ప్రస్తుత ట్రెండ్ ఇదే. కార్మిక సంఘాల నాయకులు ప్రధాన పాలసీగా ఇదే ఫాలో అవుతున్నారు. అందుకే రిటైర్ మెంట్ దశకు చేరిన కార్మిక సంఘాల పెద్ద లీడర్లు ఇబ్బడి ముబ్బడిగా, అక్రమ సంపాదనలో నిండా ము నిగిపోయారు. ‘ఇంతింతై వటుడింతై అన్నట్టు’ కార్మిక నేతల్లోనీ కొందరు అడ్డగోలుగా ఆస్తు లు కూడబెట్టుకుని కోట్లకు పడిగెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
గరిష్ట స్థాయికి చేరిన వారి ఆర్థిక సంపాదన, ఆస్తుల పెరుగుదల దొడ్డి మార్గంలోనే జరిగిందన్నది నిర్వీవాదంశం. ఉచితంగా లభించే వారసత్వ ఉద్యోగాలకి, కార్మికుల నుంచి లక్షలు గుంజుతున్నారు. అవే కాదు క్వార్టర్ కావాలన్నా, బదిలీలు, ప్రమోషన్లూ, చివరకు గనుల స్థాయిలో ఉన్న గల్లీ లీడర్లు సైతం షిఫ్ట్ చేంజ్‌కి, సర్ఫేస్ పనులకి ఇలా ఒకటేమిటి కార్మికులకు ఏది అవసరమైతే ఆ పనే ఆ యూనియన్ లీడర్‌కు ఆదాయవనరు అంటే అతియోశక్తి కాదు. తమ యూనియన్‌లో పని చేసే కార్మికులను సైతం వదలడం లేదు. పైసలు తీసుకోకుండా పని చేయని నిజాయితీ గల కార్మిక సంఘాల అగ్రనేతలు, ఉత్తములు మన సింగరేణిలో ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
సింగరేణిలో లంచావతారుల...
ప్రలోభాలతో కార్మిక సంఘాల అగ్ర నాయకులను బుట్టలో వేసుకుని సింగరేణి యాజమాన్యం ‘ఆడిందే ఆట పాడిందే పాట‘ అన్నట్టు రెచ్చిపోతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైరవీల ఆర్థిక వాటాలతో లీడ ర్లను కట్టిపడేసి సింగరేణి కార్పొరేట్ మేనేజ్మెంట్ తమకు అడ్డులేకుండా బహుముఖ వ్యూహంతో వ్యవహరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా సింగరేణి కార్మికుల మీద పై చెయ్యి సాధించి, పనిబారానికి, పనులకీ, గనులకీ కార్మికులను కట్టు బానిసలుగా మార్చివే సిందన్న విమర్శలు లేకపోలేదు.
అందులో భాగంగానే వెళ్లివిరిసిన సింగరేణి కార్మికుల పోరాట స్ఫూర్తిని యజమాన్యం దశల వారీగా మందగింప చేస్తూ వస్తోంది. ఫలితంగా సింగరేణి కార్మికుల్లో స్తబ్దత, నిస్సహాయత ఆవ రించింది. యాజమాన్యం దూకుడుకి, కార్మిక సంఘాల నాయకత్వ స్థాయి లీడర్ల లొంగుబాటు తనమే ప్రధాన కారణం అన్న విమర్శలు వారిపై ఉన్నాయి. అంతే కాకుండా సింగరేణి లో పోరాట కల్చర్‌ను ధ్వంసం చేసిన ఘనులు వాళ్ళు. అవినీతి దాస్యశృంకాల నుంచి సింగరేణి విముక్తికీ మంచి రోజులు రావాలని ఆశి ద్దాం. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో తొలితరం సింగరేణి కార్మికుల కోసం అసువులు బాసిన కార్మికోద్యమ నిర్మాత శేషగిరిరావు లాంటి నేతలు మళ్ళీరావాలంటూ సింగరేణి పిలుస్తోంది.